
డిసెంబర్ 29 (శ్రీరామ్ చక్రి న్యూస్)రంగారెడ్డి జిల్లా, మీర్పేట్:
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన ముగ్గురు చిన్నారులతో కలిసి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.
మీర్పేట్ ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, భూపేష్ గుప్తా నగర్‌కు చెందిన అన్నపూర్ణ (26) ఈ నెల 8వ తేదీ నుంచి తన ముగ్గురు పిల్లలు గౌతమ్ (8), మహేంద్ర (6), మాధవి (4) తో కలిసి కనిపించకుండా వెళ్లిపోయింది.
కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల వద్ద విస్తృతంగా వెతికినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో భర్త బాలరాజు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన జరిగి దాదాపు 20 రోజులు గడిచినా, ఇప్పటివరకు తల్లి-పిల్లల ఆచూకీ లభించకపోవడం స్థానికుల్లో ఆందోళనకు గురి చేస్తోంది. ఎవరైనా సమాచారం కలిగి ఉంటే పోలీసులకు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
