హనుమకొండ జిల్లా పౌర సరఫరాల శాఖలో వసూళ్ల దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతున్నది. రైస్ మిల్లుల ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని కొందరు రైస్ మిల్లర్లే అంగీకరిస్తున్నారు.

రెండు నెలల క్రితం జిల్లాలోని రైస్ మిల్లలకు తనిఖీకి వెళ్లిన సివిల్ సప్లయ్స్ అధికారులు సుమారు రూ. 1.30 కోట్ల విలువ చేసే ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. అయితే అప్పటి నుంచి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. షార్ట్ఫాల్ వచ్చినప్పటికీ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఓ ఉన్నతాధికారిని మచ్చిక చేసుకొని అక్రమ దందా నడిపిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులే మళ్లీ అవినీతి వ్యవహారం నడుపుతున్నట్లు జోరుగా చర్చ సాగుతున్నది.
