
ఎల్బీనగర్, అక్టోబరు 19 (తెలుగు ప్రభ): విజయదశమి పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఎల్బీనగర్ సీఐ బి.వెంకటేష్ సూచించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పండుగ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు భద్రతా సూచనలు చేశారు. ఇళ్లకు తాళాలు వేసి సొంతూళ్లకు వెళ్లేవారు విలువైన ఆభరణాలు, నగదు భద్రపరచుకోవాలన్నారు. ఇంటి పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.పండుగ వేడుకల్లో ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలపై ప్రమాదకర విన్యాసాలకు పాల్పడవద్దన్నారు. బాణసంచా కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నారులను పెద్దలు పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలంతా పోలీసులకు సహకరించి దసరా వేడుకలను సురక్షితంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని సీఐ బి.వెంకటేష్ సూచించారు.
