
హైదరాబాద్: అక్టోబర్:19(శ్రీరామ్ చక్రి న్యూస్)రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అభిప్రాయపడినట్లు తెలిసింది. సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్ఆర్డీసీలో ముఖ్యమంత్రిని మధుయాష్కీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఐపీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయనకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుమారు గంటన్నరపాటు వివిధ అంశాలపై చర్చించారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఫీజు రీయింబర్స్మెంట్, గత ప్రభుత్వ హయాంలో చేసినట్లు పేర్కొంటున్న రూ.8 లక్షల కోట్ల అప్పులు, వాటిపై వడ్డీ భారం తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అర్హులకు ఉచిత విద్యుత్తు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, రైతు రుణమాఫీ, సన్నవడ్లకు రూ.500 బోనస్ వంటి పథకాలను ప్రజలకు వివరించడంపై దృష్టి సారించాలని అభిప్రాయపడినట్లు తెలిసింది.అభివృద్ధిపై నిరంతర సమీక్షలుఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల ద్వారా విద్య, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చర్చించినట్లు సమాచారం. సంక్షేమ పథకాల అమలు తీరును ఎప్పటికప్పుడు సమీక్షించి, సంబంధిత శాఖల నుంచి పురోగతి నివేదికలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది.ఏఐపీసీకి పూర్తి సహకారంరాష్ట్రంలో ఏఐపీసీ బలోపేతానికి తనవంతు సహకారం అందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం. వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రభుత్వ విధానాల రూపకల్పనలో భాగస్వాములను చేయాలని చర్చించారు. నిపుణుల సూచనలు, అధ్యయన నివేదికల ద్వారా సంక్షేమ పథకాల అమలును మరింత మెరుగుపరచవచ్చని ఇరువురు అభిప్రాయపడినట్లు తెలిసింది.
