ఒకప్పుడు పొలం కోసిన తర్వాత రైతులు గడ్డిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకునేవారు. ధాన్యం తడిసినా పెద్దగా ఇబ్బంది పడకపోయినా.. గడ్డి తడిస్తే మాత్రం చాలా మదనపడేవారు. పశువుల కోసం అంతలా ఆరాటపడేవారు. పోస.. పోస జమచేసి కుప్పేవేసి ఏడాదంతా మేతకు వాడేవారు. అయితే, కాలక్రమేనా పశువుల వినియోగం తగ్గడం, మిషన్ల వాడకం పెరగడంతో ఇప్పుడు అదే గడ్డిని మడిలోనే తగుల బెడుతున్నారు.

సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించి, ఈత వనాలు, ఆయిల్‌పామ్, మామిడి తోటలు, ఇతర పంటలు దగ్ధమవుతున్నాయి. విద్యుత్ మోటర్లు, వైర్లు, వాహనాలు బూడిదవుతున్నాయి. పశువుల కొట్టాలు కాలిపోతుండగా, మూగ జీవాల కూడా చనిపోతున్నాయి. మరోవైపు దగ్ధంతో భూమిపైనే కాదు, నేల లోపల అంతకంటే ఎక్కువే నష్టం వాటిల్లుతున్నది. పంటకు మేలుచేసే సూక్ష్మజీవులు చనిపోవడమేకాదు, సారవంతమైనభూమి దెబ్బ తింటుంది. దిగుబడిపై ప్రభావం చూపుతుంది.
