‘ పేరు గొప్ప.. ఊరు దిబ్బ..’ అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ సర్కారు తీరు. దేశానికి వెన్నెముకలా ఉన్న రైతులకు ‘రైతుభరోసా’ ఇవ్వడంలో మీనమేషాలు లెక్కపెడుతున్నది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలోని రైతులకు ఏనాడూ పెట్టుబడి సాయం సక్రమంగా ఇచ్చింది లేదు. వ్యవసాయ సీజన్ ప్రారంభంలో ఇవ్వాల్సిన డబ్బులు తీవ్ర జాప్యం చేస్తూ ఎప్పటికో ఇవ్వడం..

మొదటి విడతలో ఒక ఎకరానికి మాత్రమే రూ.6 వేలు జమ చేయగా.. రెండో విడతలో మరో ఎకరానికి ఇస్తామని.. ఇక మూడో విడతలో ఇంకొంత.. అంటూ చెప్పుకొచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఈ యాసంగి సీజన్లో మొత్తం రూ.355 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం రూ.98 కోట్లు మాత్రమే ఇచ్చింది. రైతులు 1,91,092 మంది ఉండగా.. 1,77,201 మందికి మాత్రమే డబ్బులు జమ కావడం గమనార్హం. ఏదేమైనా యాసంగి సీజన్ పూర్తికావొస్తుండడంతో రెండో విడత డబ్బులపై రైతుల్లో అనుమానం కలుగుతున్నది. ఇక మూడో విడత దేవుడెరుగు అన్నట్లు ఉంది.
