ఉమ్మడి జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు జిల్లాలోని సాలూరా, ధర్పల్లి, నిజామాబాద్ రూరల్, సిరికొండ, కామారెడ్డి జిల్లా బీర్కూర్ తదితర మండలాల్లో వరి, మక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

ధర్పల్లి మండల కేంద్రంలోని ఇందల్వాయి రోడ్డు, దమ్మన్నపేట్ రోడ్డులో అడ్డంగా చెట్లు నేలకూలడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. నువ్వుల పంట సైతం నేలకొరిగింది. ధర్పల్లి, సిరికొండ మండలాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడిపోయాయి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. సాలూరా మండలంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆదివారం పర్యటించి, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
