తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నిరుపేద రోగులకు పెద్ద దిక్కుగా ఉన్న ఖమ్మం ‘పెద్దాసుపత్రి’.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కష్టాల్లో పడింది. ఆహ్లాదకరమైన వాతావరణం, క్యాథ్లాబ్, డయాలసిస్, మాతా శిశు సంరక్షణ కేంద్రం, తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ వంటి ఎన్నో అద్భుత సేవలతో నాడు అభాగ్యులను అక్కున చేర్చుకున్న జిల్లా ప్రభుత్వాసుపత్రి.. నేడు అడుగడుగునా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది.

ఎమర్జెన్సీ వైద్యసేవలు, కొవిడ్ వంటి మహమ్మారి నుంచి వందలాది ప్రాణాలకు రక్షణ కవచంలా మారిన ఈ ధర్మాసుపత్రి.. ప్రస్తుత సర్కారు హయాంలో విలవిల్లాడుతోంది. రెండేళ్ల నుంచి హెచ్‌డీఎస్ నిధులు నయాపైసా విడుదల చేయని కారణంగా కనీసం మందు గోళీలు కూడా లభ్యం కాని దుస్థితి. మోకీలు మార్పిడి మెటీరియల్ ఇప్పటికే నిలిచిపోయింది. పలు రకాల సర్జికల్స్, ఆక్సిజన్, గుండెకు స్టంట్ల కోసం చేస్తున్న అప్పులు గుదిబండలా మారాయి.
