యాదాద్రి భువనగిరి జిల్లాలో రోజురోజుకు భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. వేసవి నేపథ్యంలో పాతాళగంగ అడుగంటుతున్నది. జిల్లాలో మార్చిలో సగటున 7.73మీటర్ల లోతున నీళ్లున్నాయి. ఫిబ్రవరితో పోలిస్తే 1.24మీటర్ల కిందకు నీటిమట్టం పడిపోయింది. దీంతో బోర్లు, బావులు వట్టిపోతున్నాయి.

జిల్లాలో గత కొన్నేండ్లుగా భూగర్భ జలాలు పుష్కలంగా ఉండేవి. ఏటా గంగమ్మ ఉబికివచ్చింది. ఐదారు మీటర్ల దూరంలోనే నీటిమట్టం ఉండేది. కానీ గత కొంత కాలంగా వివిధ కారణాలతో భూగర్భ జలాలు ఇంకిపోయాయి. మార్చిలో జిల్లా సగటున 7.73మీటర్ల దూరంలో నీళ్లు ఉండగా, గతేడాది ఇదే నెలలో 12.05 మీటర్ల మట్టంలో జలాలు ఉన్నాయి. ఈ వర్షాకాలం సీజన్లో వానలు బాగానే కురిసినా.. రానురాను నీళ్లు ఇంకిపోతున్నాయి. ఇక ఫిబ్రవరిలో 6.49 మీటర్ల దూరంలో నీళ్లున్న విషయం తెలిసిందే.
