కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకునే పరిస్థితిలో లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం అంతా భూముల చుట్టే తిరుగుతుందని అన్నారు.

రంగారెడ్డి జిల్లా కోహెడ్ పండ్ల మార్కెట్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కోహెడకు పండ్ల మార్కెట్ వస్తే స్థానిక ప్రజలు బాగుపడతారని కేసీఆర్ భావించారని తెలిపారు. కానీ ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలంటే వేరే చోట స్థలం కేటాయించవచ్చు కదా అని ప్రశ్నించారు. మార్కెట్‌ను కాపాడుకోవడానికి అందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు, స్థానికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
