నిత్యం బాంబుల మోత.. రాత్రీపగలు తేడా లేకుండా బ్లాస్టింగ్ రోత.. అనుమతులు ఉండవు.. అడిగేవాళ్లుండరు.. ఆడిందే ఆట.. పాడిందే పాట.. కోట్లలో అక్రమార్జన.. .. ఇదీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని చల్లూరు గుట్టల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ దందా.

నిత్యం బాంబుల మోత.. రాత్రీపగలు తేడా లేకుండా బ్లాస్టింగ్ రోత.. అనుమతులు ఉండవు.. అడిగేవాళ్లుండరు.. ఆడిందే ఆట.. పాడిందే పాట.. కోట్లలో అక్రమార్జన.. సర్కార్ ఖజానాకు గండి.. ఇదీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని చల్లూరు గుట్టల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ దందా. కొంతకాలంగా ఆలేరు ముఖ్య నేత కనుసన్నల్లో యథేచ్ఛగా సాగుతున్నది. జిల్లాలోని రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాలకు సరిహద్దులో చల్లూరు గుట్టలు ఉన్నాయి. సర్వే నంబర్ 322లో సుమారు వెయ్యి ఎకరాలకుపైగా కొండలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ, సీలింగ్, ప్రైవేట్ భూములు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలోనే ఈ గుట్టల్లో కొత్తగా ఓ క్రషర్ ప్రారంభించారు. గుట్టలు అనువుగా ఉండటంతో అప్పటినుంచి మైనింగ్ మాఫియా బరితెగించింది.
