వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా దంచికొట్టింది. మరో 20 రోజుల్లో చేతికచ్చే దశలో వరి నేలకొరగగా, మామిడి కాయలు నేలరాలిపోయి రైతన్నకు అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. కన్నీళ్లే మిగిల్చింది. కోనరావుపేట మండలం మరిమడ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన రాళ్లవాన పడడంతో చేతికోచ్చే దశలో వరి నేలవాలింది. సుమారు 120మంది రైతులకు చెందిన 250 ఎకరాల్లో వరి దెబ్బతిన్నది.

ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. కాగా, నష్టపోయిన పంటలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలాగే ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్లో మామిడి తోట కౌలు రైతు అబ్బేని భీమయ్యకు కన్నీరే మిగిలింది. గ్రామంలోని ముదిరాజ్ సంఘానికి సంబంధించిన ఆరున్నరెకరాల మామిడి తోటను 5లక్షలకు కౌలుకు తీసుకోగా, అకాల వానతో చేతికందే దశలో కాయలన్నీ నేలరాలిపోయాయి.
