జిల్లాకు కొత్తగా కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన రిజ్వాన్బాషా తన విధుల్లో దూకుడు పెంచడంతో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. కలెక్టర్గా విధుల్లో చేరిన నాటి నుంచే తనదైన శైలిలో ప్రతి కార్యాలయాన్ని అకస్మికంగా సందర్శిస్తూ, తనిఖీ చేస్తుండడంతో అవినీతి అధికారులు, విధులపై అలసత్వం వహించే అధికారులు హడలెత్తిపోతున్నారు.

కలెక్టర్గా విధుల్లో చేరిన తర్వాత మొదట ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రక్షాళన చేయడానికి పూనుకున్నాడు. అందులో భా గంగా గతంలో మాదిరిగా కాకుండా రౌండ్ టేబుల్స్ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధికారుల అక్కడే కూ ర్చునే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదులు చేయడానికి వచ్చే వారికి గతంలో పని చేసిన వారు సౌకర్యాలు కల్పించకపోవడంతో వరుసలో గంటల తరబడి నిలబడి తమ ఫిర్యాదులు ఇచ్చేవారు. అయితే దానిని పూర్తిగా మార్చేశాడు. ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించి వారు తమ దరఖాస్తులు అధికారులకు ఇచ్చే వరకు ప్రశాంతంగా కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేశాడు. ఇలా తన పరిధిలో ఉన్న అన్ని శాఖలపై రోజు వారీగా తనిఖీలు చేస్తూ ఆయా శాఖలను పర్యవేక్షణ చేస్తున్నారు.
