డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో సామాన్యులే బలవుతున్నారు. మద్యం తాగి వాహనం నడిపి, పోలీసులకు పట్టుబడిన తర్వాత, సీజ్ చేసిన వాహనాలు తిరిగి తీసుకోవడానికి వాహనదారులు నానా కష్టాలుపడుతున్నారు. తాగి వాహనం నడపడంతోపాటు రిజిస్ట్రేషన్ పేపర్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్లాంటివి లేని కారణాలతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు

మద్యం తాగి వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నియంత్రించడానికి పోలీసు శాఖ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్, కోర్టు ద్వారా జరిమానాలు విధించేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో.. ప్రధానంగా వరంగల్ నగరంలోని కాజీపేట, హనుమకొండ, మట్టెవాడ ట్రాఫిక్ పోలీసులతోపాటు శివారు ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులు క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపడుతుండగా.., రోజుకు సగటున 120 నుంచి 200 మంది వాహనదారులు పట్టుబడుతున్నారు. బ్రీత్ ఎనలైజర్లో ఆల్కహాల్ శాతం 35కు మించి ఉంటే వెంటనే వాహనాన్ని సీజ్ చేసి కోర్టులో జరిమానా చెల్లించేందుకు సంబంధిత పోలీసు స్టేషన్ కోర్టు కానిస్టేబుల్కు రెఫర్ చేస్తారు. పట్టుబడిన వాహనదారులు హనుమకొండలోని కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరై కోర్టు ద్వారా ఫైన్ చెల్లించి వాహనాలను రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు కథ మొదలువుతుంది.
