
హైదరాబాద్ :శ్రీరామ్ చక్రీ న్యూస్ పేపర్ .బడంగ్పేట, అక్టోబర్ 4: అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బడంగ్పేటలోని మాస్టర్మైండ్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం META-2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విశేష కృషి చేస్తున్న 275 మంది ఉత్తమ ఉపాధ్యాయులను అవార్డులతో సత్కరించారు.అచ్చంపేట, మహేశ్వరం, కడ్తాల్, కేశంపేట, కొల్లపడకల్, తుక్కుగూడ, చంపాపేట, బడంగ్పేటతో పాటు హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతాల్లోని 150 పాఠశాలల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఒకే వేదికపై సత్కారం అందుకున్నారు.విద్యార్థికి దిశ చూపడమే నిజమైన బోధన ,కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఐఎంసీ చైర్మన్ ప్రొఫెసర్ వి. విశ్వనాథం ‘మెరుగైన ఉపాధ్యాయుడిగా ఎలా ఉండాలి’ అనే అంశంపై ప్రసంగించారు. పాఠాలు బోధించడంతోనే ఉపాధ్యాయుడి బాధ్యత ముగియదని, విద్యార్థిలో దాగి ఉన్న సామర్థ్యాన్ని వెలికితీసి, విలువలు నేర్పి, జీవితానికి సరైన దిశ చూపడమే నిజమైన బోధన అని పేర్కొన్నారు.గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ,మాస్టర్మైండ్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చేపడుతున్న గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా నిర్వాహకులు వివరించారు. విద్యతో పాటు చేతి నైపుణ్యాలను పెంపొందించి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమానికి న్యూ మాస్టర్మైండ్స్ జూనియర్ కాలేజీ స్పాన్సర్గా వ్యవహరించింది. ‘తక్కువ ఫీజు–ఎక్కువ ర్యాంకులు… సామాన్యుడి కళాశాల–కార్పొరేట్ ప్రమాణాలు’ అనే ఆశయంతో విద్యార్థులకు విద్యను అందిస్తున్నట్లు కళాశాల ప్రతినిధులు పేర్కొన్నారు.కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ జగన్ మోహన్ రావు, సెక్రటరీ డాక్టర్ పాండు, డైరెక్టర్లు నాగేంద్ర, లక్పతి, బాలాజీ, ప్రిన్సిపాళ్లు విజయకృష్ణ, నవనీత, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ రెడ్డి, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొని అవార్డు గ్రహీతలను సత్కరించారు.“ఒక మంచి ఉపాధ్యాయుడు వంద తరాలను మార్చగలడు. మేము అవార్డు ఇవ్వడం కాదు… ఇప్పటికే సమాజం ఇచ్చిన గౌరవాన్ని వేదికపై నిలబెడుతున్నాం” అని నిర్వాహకులు పేర్కొన్నారు.ఉపాధ్యాయుల సేవలను గుర్తించడంతో పాటు గ్రామీణ ప్రతిభను ప్రోత్సహిస్తూ, రాబోయే తరాలకు మెరుగైన విద్య అందించాలనే సందేశంతో META-2026 కార్యక్రమం ముగిసింది.
