
మీర్పేట్, జూన్ 7 (శ్రీరామ్ చక్రీ న్యూస్): మీర్పేట్ 60వ డివిజన్ పరిధిలోని సత్యసాయి నగర్ కాలనీలో గత నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ మీర్పేట్ అధ్యక్షుడు తులసి ముకేష్ ముదిరాజ్ తెలిపారు.

ప్రతి ఏడాది వరదల కారణంగా మిథిలా నగర్, సత్యసాయి నగర్ కాలనీలు ముంపునకు గురవుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఎస్ఎన్డీపీ నాలా పనులు చేపట్టిందన్నారు. అయితే నాలా తవ్వకాల సమయంలో సత్యసాయి నగర్‌కు నీటిని అందించే పైప్‌లైన్ దెబ్బతినడంతో తాగునీటి సరఫరా నిలిచిపోయిందని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, నాలా పనులు పూర్తయ్యే వరకు నీటి సరఫరా పునరుద్ధరణ సాధ్యం కాదని, దీనికి దాదాపు రెండు నెలలు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపినట్లు చెప్పారు. దీంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
కాలనీలోని అనేక కుటుంబాలు ఇంటి బోర్ల సౌకర్యం లేక పూర్తిగా ప్రభుత్వ తాగునీటి సరఫరాపైనే ఆధారపడి ఉన్నాయని, రెండు నెలల పాటు నీరు అందకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.బడంగ్ పేట్ సర్కిల్ కమిషనర్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు చేపట్టి తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని తులసి ముకేష్ ముదిరాజ్ కోరారు.
