ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాలి – బీజేపీ నాయకుల డిమాండ్
మీర్పేట్ :

శంషాబాద్ జోన్లో మీర్పేట్, బడంగ్పేట్ కార్పొరేషన్లను విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
మీర్పేట్ బీజేపీ అధ్యక్షులు పసునూరి బిక్షపతి చారి, తులసి ముఖేష్ ముదిరాజ్ గార్ల ఆధ్వర్యంలో కనకదుర్గ కన్వెన్షనల్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ అంశంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
నాయకులు మాట్లాడుతూ, గతంలో పాతబస్తీ ప్రాంతాల్లో చోటు చేసుకున్న అశాంతి, మతకల్లోలాల నేపథ్యంలో శాంతి భద్రతల కోసం మీర్పేట్, బడంగ్పేట్ ప్రాంతాలకు వలస వచ్చిన దళిత, బడుగు వర్గాల ప్రజలు ఇప్పుడు మళ్లీ భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ విలీన నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఈ ప్రాంతాలు మరోసారి సామాజిక అసమానతలు, భద్రతా సమస్యలకు కేంద్రంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ రెండు కార్పొరేషన్లను 6 డివిజన్లుగా విభజించి శంషాబాద్ జోన్లో కలపడం ద్వారా, తర్వాత హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనం చేసే ప్రయత్నం జరుగుతుందని, దీని వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని వారు పేర్కొన్నారు.
ప్రజా సమస్యలపై మౌనం తగదని విమర్శ
ఈ కీలక అంశంపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీరాములు యాదవ్ ప్రజల తరఫున పోరాటం చేస్తుంటే, స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి అసెంబ్లీలో ఈ సమస్యను ప్రస్తావించకపోవడం బాధాకరమని నాయకులు విమర్శించారు.
ఇది దళిత, బడుగు వర్గాల ప్రజల సమస్యలను విస్మరించినట్లేనని వారు అభిప్రాయపడ్డారు.
ప్రజల ప్రశాంతత, భద్రత, ఉపాధి అవకాశాలకు భంగం కలిగించే విధంగా ఈ విలీన ప్రక్రియ కొనసాగకూడదని, ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శులు ధ్యాసాన్ని తిరుపతి రెడ్డి, ఇందిరావత్ రవి నాయక్, మాజీ ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు పెండ్యాల నరసింహ, జిల్లా కౌన్సిల్ సభ్యులు కోడూరు సోమేశ్వర్, దళిత సంఘాల ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
