ఆరుగాలం కష్టపంచిన వడ్లు అకాల వర్షానికి తడిసి ముద్ద కావడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. వడ్లు వాననీటికి కొట్టుకుపోయాయి.

ఏ సెంటర్కు వెళ్లినా రైతులు కన్నీరు మున్నీరవుతూ కనిపించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు సరాసరిగా 61 శాతం మాత్రమే వడ్లు కొనుగోలు పూర్తి చేశారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో కలిపి మొత్తం 9,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు కేవలం 5,89,000 ధాన్యం సేకరించారు. సిద్దిపేట జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యానికి 2,54,000 మెట్రిక్ టన్నులు కొన్నారు. 63 శాతం మేర పూర్తి అయింది.మెదక్ జిల్లాలో 3.50 లక్షల ధాన్యం సేకరణకు 2,40,000 మెట్రిక్ టన్నులు కొన్నారు.
