వేసవి సెలవులు కావడంతో ప్రతిరోజూ కలుస్తూ సరదాగా గడుపుతున్నారు. రోజువారీలాగానే కలుసుకున్న వీరు స్విమ్మింగ్ కోసమని సిరిసిల్ల శివారులోని మానేరు వాగుకు వెళ్లారు. మొదట నీటి కుంటలో దిగిన ఇద్దరు గల్లంతుకాగా, విషయం తెలియడంతో తల్లిదండ్రుల గుండెలు పగిలిపోయాయి. వెంటనే అక్కడకు చేరుకొని, తమ పిల్లలను బతికించుకునేందుకు సీపీఆర్ చేస్తూ తల్లడిల్లినా.. అప్పటికే ప్రాణాలు గాల్లో కలిశాయి

ప్రశాంతంగా ఉన్న మానేరు తీరం శో కసంద్రమైంది. సిరిసిల్లలోని శాంతినగర్‌కు చెందిన ఎదురుగట్ల హరిచరణ్‌గౌడ్ (17), వేములవాడ మండ లం చీర్లవంచ ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన అల్లం మణికంఠ (17), ఆవుల శివకుమార్, పులి అభిలాష్, పులి సాయిచరణ్, మంద అభిలాష్ స్నేహితులు. పదో తరగతి వరకు కలిసే చదువుకున్న వీరంతా, ప్రస్తుతం వేర్వేరు కళాశాలల్లో ఇంటర్ చదువుకుంటున్నారు. ఇటీవలే ఫస్టియర్ పూర్తి చేశారు. వేసవి సెలవులు రావడంతో నిత్యం కలుస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. రోజువారీలాగానే శుక్రవారం ఉదయం 6గంటలకు కలిశారు. సిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానానికి వెళ్లి, గంటకుపైగా క్రికెట్ ఆడుకున్నారు.
