
శ్రీరామ్ చక్రీ న్యూస్, మీర్పేట్:
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ, రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా అనేక ప్రాంతాలు ఇంకా అభివృద్ధికి నోచుకోలేదని మీర్పేట్ బీజేపీ అధ్యక్షుడు తులసి ముకేష్ ముదిరాజ్ విమర్శించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశించారని, అయితే 12 ఏళ్ల తర్వాత కూడా అనేక ప్రాంతాలు కనీస సౌకర్యాలకు నోచుకోకుండా ఉన్నాయని అన్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్, గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారంలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని పేర్కొన్నారు.మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని జీహెచ్ఎంసీ మీర్పేట్ డివిజన్లో ఉన్న జిల్లెలగూడ సాయి నగర్ శ్మశానవాటిక దయనీయ స్థితిలో ఉందన్నారు. శ్మశానవాటికలో చెత్తాచెదారం పేరుకుపోయి ఉండటంతో పాటు, స్నానానికి నీటి సదుపాయం లేదని, మహిళలకు ప్రత్యేక స్నాన గదులు కూడా లేవని తెలిపారు. ఒక శ్మశానవాటికకు ఉండాల్సిన కనీస వసతులు కూడా లేకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎవరైనా మరణిస్తే వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించుకుని అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉందని, ఒకేసారి ఇద్దరి అంత్యక్రియలు నిర్వహించే సదుపాయం కూడా లేదని చెప్పారు. ఎన్నో వినతిపత్రాలు అధికారులకు అందజేసినా, అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నాయకుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
కేంద్రం నుంచి నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ శ్మశానవాటిక అభివృద్ధి ఎందుకు జరగడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సాయి నగర్ శ్మశానవాటికను వెంటనే అభివృద్ధి చేయాలని మీర్పేట్ బీజేపీ తరఫున డిమాండ్ చేశారు.
