
శ్రీరామ్ చక్రీ న్యూస్, బడంగ్పేట్:
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి ఈరోజు సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. విచారణ అనంతరం ఆమె మాట్లాడుతూ, తనతో పాటు తన భర్త స్టేట్మెంట్ను సిట్ అధికారులు సుమారు 30 నిమిషాల పాటు రికార్డ్ చేశారని తెలిపారు.
2022 ఎన్నికల సమయంలో తమ ఇద్దరి ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్లు సిట్ అధికారులు తెలియజేశారని, అధికారులు చెప్పేవరకు ఆ విషయం తమకు తెలియదని పేర్కొన్నారు. ప్రజా సేవలో నిరంతరం నిమగ్నమై ఉండటంతో ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయాన్ని గుర్తించలేకపోయామని అన్నారు.
గత ప్రభుత్వంలో ఓ మహిళా మాజీ మంత్రి తమపై రాజకీయ కక్షతో వ్యవహరించారని, నియోజకవర్గంలో తాము పోటీగా ఎదుగుతామనే ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ చేయించారనే అనుమానం ఉందని ఆమె ఆరోపించారు. ఎన్నికల సమయంలో తమ కదలికలపై నిరంతరం నిఘా ఉంచేవారని, తాము చేపట్టే కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించేవారని ఆమె పేర్కొన్నారు
