బోయినపల్లి మండలం నీలోజుపల్లిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని అధికారులు కాంగ్రెస్ నేతకు రాసిచ్చిన వ్యవహారంపై కలెక్టర్ గరిమా అగ్రవాల్ సీరియస్ అయ్యారు.

నీలోజుపల్లి సర్పంచ్ అనుముల భాస్కర్‌తో పాటు వార్డు సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతారామాలయం గ్రామ పంచాయతీ ఆస్తి అని, ఓ వ్యక్తికి చెందిన ఆస్తిగా సర్టిఫికెట్ ఎలా జారీ చేస్తారని మండిపడుతూ కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టర్ లేకపోవడంతో అదనపు కలెక్టర్ కలిసి ఫిర్యాదు చేశారు. మంగళవారం మరోసారి కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టర్ గరిమా అగ్రవాల్‌ను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తహసీల్దార్, ఆర్ఐతోపాటు కాంగ్రెస్ నేత కూస రవీందర్ నిర్వాకంపై వివరించారు. కాంగ్రెస్ నేత ఆస్తిగా మార్చిన రామాలయం ఆస్తిని తిరిగి గ్రామపంచాయతీకి బదలాయించాలని విన్నవించారు. దీంతో కలెక్టర్ స్పందించి, సర్టిఫికెట్ జారీ చేయడంపై సీరియస్ అయ్యారు. సంబంధిత తహసీల్దార్, ఆర్ఐపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారని సర్పంచ్ భాస్కర్, గ్రామస్తులు తెలిపారు.
