
హైదరాబాద్:(శ్రీరామ్ చక్రీన్యూస్):25/6/2026 న్యూస్‌టుడే: మెదక్ పట్టణంలో ఈనెల 28న నిర్వహించనున్న “మాలల హక్కుల సాధన సభ”ను విజయవంతం చేయాలని మాల సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సభ పోస్టర్‌ను గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ ఎదుట తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్, మాల విద్యార్థి జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ మాల విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల మంది మాలల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై మెదక్ సభలో సమగ్రంగా చర్చించనున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అమలు నేపథ్యంలో గ్రూప్-3 లోని 26 మాల ఉపకులాలకు ఉద్యోగాలు, విద్యా అవకాశాలు, పదోన్నతుల్లో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఈ అంశాన్ని గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి సహా వివిధ రాజకీయ పార్టీల నేతల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం లభించలేదన్నారు.మాల సమాజానికి జరుగుతున్న అన్యాయంపై ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, మెదక్ సభలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా విడుదలైన పలు నోటిఫికేషన్లలో 26 మాల ఉపకులాలకు ప్రాతినిధ్యం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.మెదక్‌లో జరిగే ఈ సభకు గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి మాల విద్యార్థులు, ఉద్యోగులు, సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు తెలిపారు.
