పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు అరిగోసపడుతున్నారు. అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేశామని, తిరిగి చెల్లించేందుకు ఆస్తులు అమ్ముకున్నామని, బిల్లులు చెల్లిస్తే తప్ప ఆ ఊబిలోంచి బయటికి రాలేమని రెండేళ్లుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తమ బిల్లులు చెల్లించేదాకా పంచాయతీ ఎన్నికలు నిర్వహించవద్దని పోరుబాట పట్టారు.

ఒక్కో గ్రామంలో రూ.లక్షల్లోనే పెండింగ్ బిల్లులు రావల్సి ఉంది. మైనర్ పంచాయతీల్లో కనీసంగా 4లక్షల నుంచి 6 లక్షలు, మేజర్ పంచాయతీల్లో 30లక్షల నుంచి 40 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉందని, కొన్ని పెద్ద పంచాయతీల్లో అయితే 60లక్షల నుంచి 70 లక్షలకు మించి బకాయిలు ఉన్నట్టు మాజీ సర్పంచులు చెబుతున్నారు.
