మూసీ పరీవాహకంలోని విలువైన భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు మూసీ సుందరీకరణ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు బండ్లగూడ జాగీర్ పరిధిలోని హైదర్ ఎన్‌క్లేవ్‌లో ఆదివారం మూసీ బాధితుల అత్యవసర సమావేశం నిర్వహించారు.

విద్యార్థి విభాగం తరఫున ఇప్పటికే 50 బృందాలుగా విడిపోయి బాధితులకు భరోసా కల్పిస్తున్నామని, ప్రభుత్వం ఇండ్లను కూలిస్తే బుల్డోజర్లకు అడ్డంగా నిలబడి అండగా ఉంటామన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి భూములను కొల్లగొట్టి బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ప్రజల ఇండ్లను, భూములను చెరబడతామంటే చూస్తూ ఊరుకోమని, బాధితుల పక్షాన పోరాటాలు చేస్తామని ప్రకటించారు. మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్, మూసీ నదికి హద్దులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లు కూలుస్తామని నోటిఫికేషన్లు ఇస్తూ పేదలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
