ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను అమ్ముకునేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. పండిన ప్రతి గింజకూ మద్దతు ధర అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగం మాటలు నమ్మిన రైతులు అటు మార్కెట్ యార్డులు.. ఇటు ఐకేపీ కేంద్రాల్లో రోజుల తరబడి ఎదురు చూడాల్సివస్తున్నది.

కొనేవాళ్లు దిక్కులేక ఇటు ధాన్యం, అటు మక్కజొన్న రాశుల వద్ద ప్రతిరోజూ పిల్లా, పాపలతో సద్దులు కట్టుకొని వచ్చి పడిగాపులు కాయాల్సిన దీన్యస్థితి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నీ సమకూర్చుకోకుండానే హడావుడి అధికార ఆర్భాటంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మార్కెట్ చైర్మన్లు, అధికార పార్టీ నాయకులు, అధికారులు రిబ్బన్ కటింగ్ చేసి.. కొబ్బరికాయలు కొట్టి.. మాది రైతు సంక్షేమ ప్రభుత్వమని బీరాలు పలికి వెళ్లారు. వందల, వేల క్వింటాళ్ల ధాన్యాన్ని అమ్మకానికి తెచ్చిన రైతులకు వారం రోజులుగా ఎదురుచూపులు..పడిగాపులు తప్పడంలేదు
