కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్నీ కష్టాలేనని, పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు.

శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల మండల కేంద్రాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రెండున్నరేళ్ల రేవంత్రెడ్డి సర్కార్ పాలనలో ఆగమైన రాష్ట్ర ప్రజానీకం బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు చెప్పారు. ధాన్యం, మక్కలను రోజుల తరబడి కొనగోలు చేయకుండా సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. రైతుల ఇబ్బందులను సీఎం, మంత్రులు పట్టించుకోవడం లేదని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు.
