చుంచుపల్లి మండల పరిధిలోని ఎన్కే నగర్ గ్రామ పంచాయతీలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు గత రెండు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు

చుంచుపల్లి, మే 19 : చుంచుపల్లి మండల పరిధిలోని ఎన్కే నగర్ గ్రామ పంచాయతీలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు గత రెండు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ పంచాయతీలో మొత్తం తొమ్మిది మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తుండగా ప్రతి నెల 10వ తేదీలోపు వారి ఖాతాల్లో జీతాలు జమయ్యేవి. అయితే గత రెండు నెలలుగా వేతనాలు నిలిచిపోవడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ సంతకం చేసినప్పటికీ, ఉప సర్పంచ్ డిజిటల్ ఓటీపీ ప్రక్రియ పూర్తికాక పోవడంతో జీతాల చెల్లింపులు ఆగిపోయినట్లు సమాచారం. ఓ ఇంటికి కుళాయి కనెక్షన్ మంజూరు చేసిన విషయంపై ఉప సర్పంచ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పంప్ ఆపరేటర్ జీతం నిలిపివేయాలని సూచించినట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోంది.
