ఉపాధితో పాటు ఉన్నత విద్య కోసం వివిధ ప్రాంతాలకు పెద్ద సంఖ్యల వలస వెళ్లిన వారిని మచ్చిక చేసుకోవడంపై అభ్యర్థులు కన్నేశారు. స్వల్ప ఓట్ల తేడాతోనే గెలుపోటములు ప్రభావితమవుతున్న తరుణంలో వలస ఓటర్లను స్వగ్రామాలకు రప్పించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.

ప్రతి గ్రామం నుంచి వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. విద్య, ఉద్యోగావకాశాల కోసం వేలాది మంది హైదరాబాద్ సహా వివిధ పట్టణాల్లో నివాసముంటున్నారు. ఎల్లారెడ్డి, లింగంపేట్ మండలాల నుంచి దాదాపు 6 వేల మందికి పైగా, నాగిరెడ్డిపేట మండ లం నుంచి 2 వేల మంది కుటుంబాలతో సహా ఓటర్లు వలస వెళ్లారు. చిన్న గ్రామపంచాయతీల్లో అయితే 100 మంది దాకా, మేజర్ జీపీల్లో అయితే 200 నుంచి 400 మందికి పైగా వలస వెళ్లిన వారున్నారు. వీరంతా హైదరాబాద్‌లోని గండిమైసమ్మ, సూరారం, మేడ్చల్, బాలానగర్, కొంపల్లి, సుచిత్ర, కుత్భుల్లాపూర్, హైటెక్‌సిటీ, కొండాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, దిల్సుఖ్నగర్, జీడిమెట్ల, బోయిన్పల్లి, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో నివాసముంటున్నారు. మరికొంత మంది ఇతర జిల్లాల్లో ఉంటున్నారు.
