కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసులను సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు.. అటవీ ఆంక్షలతో నిలిచిపోయిన రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు.. నిర్వహణ లేక పల్లెలకు చేరని మిషన్ భగీరథ నీరు.. ఇలా ఒకటేమిటి ప్రజలు అనేక అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 31 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసులను సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు.. అటవీ ఆంక్షలతో నిలిచిపోయిన రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు.. నిర్వహణ లేక పల్లెలకు చేరని మిషన్ భగీరథ నీరు.. ఇలా ఒకటేమిటి ప్రజలు అనేక అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. కేసీఆర్ పదేళ్ల పాలనలో అనేక హామీలు నెరవేర్చగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలపై ఏమాత్రం స్పందించడం లేదంటూ అడవిబిడ్డలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, కెరమెరి మండలం కొలాం కొఠారి గ్రామంలో నిర్మించిన ‘ఇందిరమ్మ ఇండ్ల’ ప్రారంభోత్సవానికి సోమవారం సీఎం రేవంత్ రెడ్డి వస్తుండగా, హామీలపై ఆయన ఏ మేరకు స్పందిస్తారోనని ఆదివాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
