
(శ్రీరామ్ చక్రీన్యూస్,) 01-10-2026,హైదరాబాద్: బడంగ్పేట్: మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ సర్కిల్ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 6న బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరు డివిజన్లకు చెందిన నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బడంగ్పేట్, నాదర్గుల్, బాలాపూర్, మీర్పేట్, ప్రశాంతి హిల్స్, జిల్లెలగూడ డివిజన్ల పరిధిలోని పలు కాలనీల ప్రజలు రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.జీహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత కూడా పలు ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగడం లేదని శ్రీరాములు ఆరోపించారు. ఫాగింగ్, శానిటేషన్ వంటి ప్రాథమిక పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా చేపట్టడం లేదని విమర్శించారు.ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అక్టోబర్ 6న చేపట్టనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి కాలనీలో ప్రజలకు కార్యక్రమం గురించి వివరించి వారిని భాగస్వాములను చేయాలని కోరారు.రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని శ్రీరాములు పేర్కొన్నారు.ఈ సన్నాహక సమావేశంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి, డివిజన్ బీజేపీ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా నాయకులు, డివిజన్ పదాధికారులు, మాజీ కార్పొరేటర్లు, బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.
