ఒకవైపు దంచికొడుతున్న ఎండలు.. మరోవైపు వీస్తున్న వేడిగాలి ప్రజలను బెంబేలెత్తిస్తున్నది. ఉదయం నుంచే భానుడి ఉగ్రరూపంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. నాలుగైదు రోజులుగా సూర్యుడు తన విశ్వరూ పం ప్రదర్శిస్తుండడంతో అత్యధిక ఉష్ణోగ్రలు నమోదవుతున్నాయి.

ఎండ వేడిమికి ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. వీస్తున్న వడ గాలులకు చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వరకు కూడా వేడి సెగలకు తోడు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రోజు రోజుకూ వడదెబ్బతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. కాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శనివారం అత్యధికంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ, వ్యవసాయ కూలీలు ఉదయం 10 గంటల వరకే పనులు ముగించుకొని ఇళ్లకు చేరుతున్నారు. పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది.
