సర్కార్ బడుల్లో చదువుకునే పిల్లలకు అందించే దుస్తుల్లో నాణ్యత కొరవడింది. చిరిగిన జేబులు, గల్లాలు, ఊడిపోయిన గుండీలు, బెల్ట్ పట్టీలతో తొడుక్కున్న మూణ్ణాళ్లకే పాడవుతున్నాయి. దీంతో కుట్టిన ఆ యూనిఫామ్స్‌ను రెండు నెలలు తిరక్కముందే తల్లిదండ్రులు మళ్లీ కుట్టిస్తున్నారు.

విద్యార్థులు, విద్యార్థినులు ఎవరికైనా డ్రెస్ కుడితే రూ.75 చొప్పున ఇస్తున్నారు. అయితే, వీరిలో కొందరికి బటన్స్ వేయడం, కాజాలు పెట్టడం వంటి పనులు రాకపోవడంతో కుట్టిన డ్రెస్‌లను వేరే వారికి ఇచ్చి ఈ పనులు చేయిస్తారు. ఒక్కో డ్రెస్‌కు కేటాయించిన రూ.75లో కొలతలు తీసుకున్న తర్వాత క్లాత్ కట్ చేసిన వారికి, రవాణా చార్జి, బటన్స్, కాజా, చైన్లు వేసిన వారికి, మండల సమాఖ్యకు సర్వీస్‌చార్జి, కుట్టిన డ్రెస్‌ల క్వాలిటీ చెక్ చేసిన వారికి ఇలా కలిపి మొత్తం రూ.25 ఖర్చవుతున్నాయి. ఇవన్నీ పోను డ్రెస్ కుట్టిన మహిళలకు మిగిలేది రూ.50 మాత్రమే. అయితే, ధర తక్కువగా ఉండడం, ఆదరాబాదరాగా దుస్తులు కుడుతుండడంతో అవి నాణ్యత తగ్గి మూణ్ణాళ్లకే చినుగుతున్నాయనే ఆరోపణలున్నాయి.
