
ఎల్బీనగర్, అక్టోబర్ 18 (శ్రీరామ్ చక్రీ న్యూస్):లింగోజిగూడ డివిజన్ పరిధిలోని తపోవన కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన చెత్త సేకరణ పాయింట్ను శాశ్వతంగా తొలగించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి రామ్కీ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. మారం అపార్ట్మెంట్స్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో చుట్టుపక్కల ఏడు కాలనీల చెత్తను వేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయనను కలిసిన కాలనీవాసులు తమ సమస్యలను వివరించారు. చెత్త పేరుకుపోవడంతో పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వ్యాపిస్తోందని, అపరిశుభ్ర వాతావరణంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో కొందరు యువకులు ఖాళీ స్థలంలో మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీంతో మహిళలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు.కాలనీవాసుల ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెంటనే రామ్కీ సంస్థ ప్రతినిధులకు ఫోన్ చేసి మాట్లాడారు. నివాస ప్రాంతాల మధ్య చెత్త సేకరణ పాయింట్ను కొనసాగించడం సరికాదని, ప్రజల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ దానిని శాశ్వతంగా తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలపై సంబంధిత సంస్థలు తక్షణమే స్పందించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ డివిజన్ సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు తిలక్ రావు, కాలనీవాసులు ప్రసాద్, శ్రావణ్ కుమార్ రెడ్డి, రమేష్, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.తపోవన కాలనీ చెత్త సమస్యను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి వివరిస్తున్న కాలనీవాసులు.
