కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన 2023లో నిర్మించిన 560 డబుల్ బెడ్రూం ఇండ్లకు మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అప్పగించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

సోమవారం వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ సూర్యనారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ పర్యవేక్షణలో ఆర్డీఓ నేతృత్వంలో సీసీ కెమెరాల మధ్య 560 మంది లబ్ధిదారులను నిష్పక్షపాతంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. దీంతో పాటు ఇండ్ల సమీపంలో హెల్త్ సెంటర్, మిషన్ భగీరథ పైప్లైన్లు కూడా వేయించామని, ఇక ఇండ్లకు విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయించాల్సిన పరిస్థితిలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్తో గృహ ప్రవేశాలు నిలిచిపోయాయన్నారు.
