నల్లగొండలోని ప్రభుత్వ ప్రధాన దవాఖాన ఆవరణలోని పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని సోమవారం తెల్లవారు జామున కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీ చేశారు. ఉదయం 5 గంటలకే జీజీహెచ్‌కు చేరుకున్న కలెక్టర్ ఎలాంటి ఆశ్రయం లేని వారు నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డిని, మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. గడిచిన రెండు, మూడేళ్లుగా నల్గొండ ప్రభుత్వ దవాఖానలో నిరాశ్రయుల వసతి గృహం నిర్వహిస్తున్నారని, దీన్ని వినియోగించుకోవాలనుకునే వారు ఆధార్, చిరునామా, ఫోన్ నంబర్ ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 17 మంది ఉన్నారని, 60 మందికి వసతి కల్పించేలా ఇకడ అవకాశం ఉందని, మహిళ లు, పురుషులకు వేర్వేరు ఏర్పాట్లు ఉన్నాయని, టాయిలెట్లు తదితర వసతులు ఉన్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న వారి సహాయకులు, అత్యవసర చికిత్స నిమిత్తం వచ్చే వారి సహాయకులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
