
నిజామాబాద్, అక్టోబర్ 13:
తెలంగాణ రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఏఐసీసీ చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం నిజామాబాద్‌లోని హోటల్ హరితలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీ నియామకాలను పర్యవేక్షించేందుకు ఏఐసీసీ నియమించిన పరిశీలకులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ చేపట్టారని తెలిపారు. ‘‘ఈరోజు ప్రారంభమైన ఈ ప్రక్రియ వారం రోజులపాటు కొనసాగుతుంది. నియోజకవర్గాల వారీగా నాయకుల అభిప్రాయాలను సేకరించి, పీసీసీ మరియు ఏఐసీసీకి నివేదిక రూపంలో పంపనుంది’’ అని తెలిపారు.
సమావేశంలో ఏఐసీసీ పరిశీలకుడు రిజ్వాన్ అర్షద్, పీసీసీ ఆర్గనైజర్ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఈ నియామక ప్రక్రియ ద్వారా స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపే అవకాశం ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు.
