కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కులగణన నివేదికపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం బుధవారం అర్ధరాత్రి ప్రకటించిన సామాజిక ఆర్థిక కుటుంబ సర్వే (సీపెక్) నివేదికలో బీసీ జనాభా రాష్ట్రస్థాయిలో 46 శాతం ఉన్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనపై ఉమ్మడి మెదక్ జిల్లాలోని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగానే బీసీ జనాభా శాతం 46గా ప్రకటించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తుల్లో ప్రభుత్వాలు కులాల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసిన పక్షంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వే తప్పుల తడకగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కులాల నివేదికను రద్దు చేయాలని లేదంటే బీసీల ఆగ్రహానికి గురికాకతప్పని రేవంత్రెడ్డి సర్కార్ను బీసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. కులగణన నివేదికపై న్యాయపోరాటం చేసేందుకు బీసీ సంఘాల నాయకులు సిద్ధం అవుతున్నారు.
