ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టాలు, ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులపై ఇప్పుడు ఎరువుల ధరల పెరుగుదలతో మరో భారం పడుతుంది. డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు, సూక్ష్మ పోషకాలు అన్ని ఎరువుల ధరలు పెరిగాయి.

సిద్దిపేట, మే 28 : ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టాలు, ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులపై ఇప్పుడు ఎరువుల ధరల పెరుగుదలతో మరో భారం పడుతుంది. డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు, సూక్ష్మ పోషకాలు అన్ని ఎరువుల ధరలు పెరిగాయి. ఎరువుల ధరలు అమాంతం పెరగడంతో రైతులు బెంబేలెత్తి పోతున్నారు. 50 కిలోల కాంప్లెక్స్ ఎరువుల బస్తాకు సగటున రూ 300 వరకు, మరికొన్ని బస్తాకు రూ. 350 వరకు పెరిగాయి. కాంప్లెక్స్ ధరలు చూస్తే (16-16-16) పాత ధర రూ. 1,675 ఉంటే కొత్త ధర రూ. 2,050 ఉంది. కాంప్లెక్స్ ( 24-24-0) పాత ధర రూ. 2,000 ఉంటే కొత్త ధర రూ. 2,300 ఉంది. కాంప్లెక్స్ (20-20-13) పాత ధర రూ. 1800 ఉంటే కొత్త ధర రూ. 2150 ఉంది. ఇలా అన్ని కాంప్లెక్స్‌లపై ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతానికి డీఏపీ, యూరియా ధరలు స్థిరంగానే ఉన్నాయి.
