జిల్లా విద్యాశాఖలో పరిపాలనా వ్యవస్థ అగమ్యగోచరంగా మారింది. డీఈవో చైతన్య జైని 20 రోజులపాటు సెలవుపై వెళ్లారు. అయితే నిబంధనల ప్రకారం డీఈవో సెలవుపై వెళితే.. మరో అధికారికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించాలి.

డీఈవో సెలవుపై వెళ్లడంతో అనేక కీలక ఫైళ్లు పెండింగ్‌లో పడ్డాయి. ముఖ్యంగా ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బందికి సంబంధించిన సర్వీస్ రిజిస్టర్లతోపాటు ఖమ్మం డిప్యూటీ డీఈవో, మధిర డిప్యూటీ డీఈవో కార్యాలయంలో పనిచేసే సిబ్బంది వేతనాలు మంజూరు చేయాలంటే డీఈవోనే డిప్యూటీ డీఈవోగా కూడా సంతకాలు చేయాల్సి ఉంటుంది
డీఈవో సెలవులో ఉండటంతో డైట్‌కి సైతం ఎవరినీ ఇన్చార్జిగా నియమించలేదు. దీంతో అక్కడి సిబ్బంది వేతనాలు సైతం ఆగిపోనున్నాయి. సోమ, మంగళవారం నాటికి ఉన్నతాధికారులు స్పందించి ఇన్చార్జి బాధ్యతలు ఎవరికైనా అప్పగించాలి. లేదంటే ఈ నెల తమ వేతనాలు రానట్లేనని ఈ శాఖల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
