
హైదరాబాద్, ఏప్రిల్ 13:(శ్రీరామ్ చక్రి న్యూస్)
చేనేత రంగానికి ఊతమిచ్చే విధంగా హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ప్రభుత్వం స్కూల్ యూనిఫామ్ల కొనుగోలులో కనీసం 30 శాతం చేనేత సహకార సంఘాల నుంచే చేయాలని కోర్టు ఆదేశించింది.
ప్రభుత్వం గతంలో అమలు చేసిన విధానానికి భిన్నంగా, కార్పొరేట్ కంపెనీల ద్వారా టెండర్ విధానంలో యూనిఫామ్లు కొనుగోలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 9న తెలంగాణ చేనేత సహకార సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు, చేనేత సహకార సంఘాలకు ప్రాధాన్యత కల్పించేలా 30 శాతం కొనుగోళ్లు తప్పనిసరిగా చేయాలని స్పష్టం చేసింది.
తెలంగాణలో గత 75 సంవత్సరాలుగా చేనేత సహకార సంఘాలు వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ, వారి జీవనోపాధికి అండగా నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వాలు చేనేత శాఖ ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేసి పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, ఇతర ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేసేవి.
అయితే ప్రస్తుత ప్రభుత్వం టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో సహకార రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందని సంఘాలు వాదించాయి. ఈ నేపథ్యంలో చేనేత రంగాన్ని మరియు దానిపై ఆధారపడిన కార్మికులను రక్షించాలనే ఉద్దేశంతో కోర్టును ఆశ్రయించాయి.
కోర్టు తీర్పుతో చేనేత కార్మికులు, సహకార సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ, తమకు న్యాయం జరిగినందుకు ధన్యవాదాలు తెలిపారు.
