
డిసెంబర్ 14( శ్రీరామ్ చక్రి న్యూస్)
మా కాలనీలో హాస్టల్ వద్దు అంటూ వెంగళరావు నగర్ కాలనీవాసులు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. నివాస ప్రాంతంగా ఉన్న తమ కాలనీలో హాస్టళ్లను ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.కాలనీలో ఏడాదికాలంగా అక్రమంగా హాస్టళ్ల నిర్వహణ జరుగుతుందని, వాటిని తొలగించాలంటూ ఇప్పటికే పలు మార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీవాసులు ఆరోపించారు.
నివాస ప్రాంతాల కోసం ఏర్పాటైన కాలనీల్లో కమర్షియల్ కార్యకలాపాలను అనుమతించవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హాస్టళ్ల నిర్వహణ వల్ల నీటి కొరత, డ్రైనేజీ సమస్యలు తీవ్రమయ్యాయని తెలిపారు.
అలాగే హాస్టళ్ల కారణంగా అసాంఘిక కార్యకలాపాలు పెరిగి, మహిళలు బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఇళ్లకు తమ వాహనాలతో వెళ్లలేని దుస్థితి ఏర్పడిందని తెలిపారు.
తక్షణమే అధికారులు స్పందించి అక్రమ హాస్టళ్లపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు
