తుక్కుగూడ, అక్టోబర్ 16 (శ్రీరామ్ చక్రీ న్యూస్)

మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కిచ్చెన్నగారు లక్ష్మారెడ్డి కార్యాలయం వద్ద సోమవారం ప్రజల రద్దీ కనిపించింది. తమ సమస్యల పరిష్కారం కోసం పెద్దఎత్తున ప్రజలు తుక్కుగూడలోని ఆయన కార్యాలయాన్ని ఆశ్రయించారు.

ప్రజల సమస్యలను అర్థం చేసుకున్న కేఎల్ఆర్ తక్షణమే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా కందుకూరు మండలం సరస్వతిగూడలో నెలకొన్న భూవివాదంపై రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలోని రంగనాయకుల కాలనీలో గుడి నిర్మాణానికి స్థలం కేటాయించాలంటూ ఎస్టీ సంఘం సభ్యులు కేఎల్ఆర్ను కలిశారు. అక్కడి పాత వాటర్ ట్యాంకును తొలగించి, ఆ స్థలాన్ని గిరిజన ఆరాధ్యదైవాలయ నిర్మాణానికి కేటాయించాలని వారు కోరారు. ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన కిచ్చెన్న లక్ష్మారెడ్డి, త్వరితంగా స్పందించాలని అధికారులను కోరారు.
క్రిస్టియన్ మైనార్టీ అంశాలపై కూడా సమావేశం జరిగింది. నియోజకవర్గంలోని పలు చర్చి ఫాదర్లు, పాస్టర్లు కేఎల్ఆర్ను కలిసారు. క్రిస్మస్ పండుగ ఏర్పాట్లు, మంకాల్ విలేజ్‌లో చర్చ్‌కు నీటి సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరి సమస్యపై వెంటనే స్పందించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ప్రజల కోసమే మేమున్నాం” అని అన్నారు.
