‘చిత్తూ చిత్తుల బొమ్మ శివునీ ముద్దుల గుమ్మ’ పాటల బిందె దీస్కోని రమణి నీళ్లకు పోతే.. ఏ వాడకు పోయినా భగవంతుడు ఎదురైనడంట. ఇప్పుడు అట్లనే ఏ ఊరికి పోయినా బతుకమ్మ ఎదురైతున్నది. ఏ ఊర్ల చూసినా బతుకమ్మ ఆటే కానవస్తున్నది! బతుకమ్మ పాటలే వినపడుతున్నయి!

‘చిన్నలకు వచ్చింది ఉయ్యాలో.. చిన్న బతుకమ్మ ఉయ్యాలో’ పాడుకుంట చిన్నలు, ‘పెద్దలకు వచ్చింది ఉయ్యాలో.. పెద్ద బతుకమ్మ ఉయ్యాలో’ పాడుకుంట పెద్దలు ఆకాశమంత సంబురం చేసుకుంటున్నరు! బతుకమ్మ సంబురం మనది.
మన తెలంగాణది. మన నాగరికత, చరిత్ర, సంతోషాలు, దుఃఖాలు.. అన్నీ తనలో ఇముడ్చుకున్న బతుకమ్మ పాటలు వాగ్గేయకారుల కీర్తనలంత గొప్పయి. ప్రబంధ కవుల పద్యాలంత పసందైనయి! బతుకు పాఠాలు చెప్పిన బతుకమ్మ పాటల వైచిత్రిని ఈ పూల పండుగ సందర్భంగా తలుచుకుందాం.. అప్పుడే వచ్చింది ఉయ్యాలో.. బతుకమ్మ పండుగ ఉయ్యాలో’ తెలంగాణ జానపదం పూల పరిమళాలు అద్దుకున్నది. అడవి పూలు అందమైన బతుకమ్మగా ముస్తాబవుతున్నయి.
