నగరంలో తాగునీటి సమస్య తీవ్ర స్థాయికి చేరుకుంటున్నది. నీటి సరఫరా నిర్వహణను అధికారులు ఇష్టారీతిన చేపడుతుండటంతో పలు కాలనీలు, బస్తీలకు నీళ్లందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నారు.

ధనవంతులు నివసించే అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు నిరంతరాయంగా నీటిని సరఫరా చేస్తూ పేదలు, మధ్యతరగతి ప్రజలు నివసించే బస్తీలు, కాలనీలకు మాత్రం అర్ధగంట కూడా సరఫరా చేయడం లేదని మండిపడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో ట్యాంకర్లను ఆశ్రయిస్తే బుకింగ్ చేసుకున్నాక కనీసం మూడు నుంచి నాలుగు రోజులకు ట్యాంకర్ డెలివరీ అవుతుందని వాపోతున్నారు. అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పెద్దల దగ్గర డబ్బులు తీసుకుని పేదలు దాహార్తితో అలమటించేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధనవంతులుండే ప్రాంతాలకు ఎక్కువ సమయం సరఫరా చేసి.. పేదలుండే బస్తీలకు మాత్రం నీరివ్వడం లేదని జనాలు రోడ్డెక్కుతున్నారు
