మృగశిర వెళ్లిపోయి ఆరుద్ర కార్తె వచ్చి వారంపైగా అవుతున్నా వాన జాడ మాత్రం కానరావడంలేదు. ఈ సీజన్లో కళకళలాడాల్సిన రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, కాల్వలు, చెక్‌డ్యామ్‌లు వెలవెలబోతున్నాయి. సూపర్ ఎల్‌నినో కారణంగా నైరుతి రుతుపవనాలు విస్తరించక నెలకొన్న వర్షాభావ పరిస్థితులు పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి

ఉమ్మడి జిల్లాలో వానకాలంలో 15.80 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా జూన్ ముగింపు నాటికి కేవలం 5 శాతం మాత్రమే సాగులోకొచ్చాయి. ములుగు, భూపాలపల్లి మినహా మిగిలిన జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల పత్తి గింజలు మొలకెత్తిన తర్వాత వర్షాలు లేక ఎండిపోయాయి. రైతులు రెండోసారి విత్తనాలు కొనుగోలు చేసి మళ్లీ నాటాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని చోట్ల మొలకెత్తిన పంటను కాపాడుకునేందుకు సాగునీటి వనరులున్న రైతులు బోర్లు, డ్రిప్, స్ప్రింకర్లతో నానా పాట్లు పడుతుండగా.. వర్షాధారంగా పంటలు వేసేవారు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.
