టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సాగనంపడానికి భారీ కుట్ర జరిగిందా? భవిష్యత్తులో తన పీఠానికి ప్రధాన పోటీదారుడు అవుతారనే సంకేతాలు ముఖ్యనేతకు అందాయా? రాష్ట్రంలో బీసీ సామాజికవర్గ రాజ్యాధికార కాంక్షకు, ముఖ్యనేత సన్నిహిత మీడియాలో మహేశ్‌గౌడ్‌పై వ్యతిరేక కథనాలకు లింక్ ఉన్నదా? అంటే గాంధీభవన్ వర్గాలు ‘అవును’ అనే చెప్తున్నా యి.

తెలంగాణలో జరిపిన కులగణన దేశ రా జకీయాలనే కుదిపేసేంత కీలమైనవని, బీసీల విద్య, ఉద్యోగాలు, రాజకీయల్లో పెనుమార్పులు తెస్తాయని గత ఏడాది జూలైలో లోక్‌సభలో రాహుల్‌గాంధీ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో బీసీ సామాజికవర్గాలకు రాజ్యాధికార కాంక్ష తారస్థాయికి చేరింది. ఫలితంగా బీసీలకు రాజకీయ ప్రాధాన్యం తప్పక ఇవ్వాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అధిష్ఠానం.. సీనియర్ కాంగ్రెస్ నేత, గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రునిగా గుర్తింపు ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్టు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిణామాలే ముఖ్యనేతకు కంటిమీద కునుకు లేకుండా చేశాయని ప్రచారం జరుగుతున్నది.
