విశ్వ నగర స్థాయి సౌకర్యాలు వస్తాయని ప్రభుత్వం ఆకాశమంత ఆశలు కల్పించింది..కానీ ఎక్కువ సమయం తీసుకోకుండానే జీహెచ్ఎంసీ శివారు ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. జీహెచ్ఎంసీకి సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.11,460 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించగా సోమవారం స్టాండింగ్ కమిటీ సభ్యులు ఈ బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు.

పన్నులు, నిర్మాణ రంగ ఫీజులు, ట్రేడ్ లైసెన్స్‌ల రూపంలో వసూళ్లకు రాబట్టుకుని ..వారికి సౌకర్యాల కల్పనలో మాత్రం వచ్చిన నిధులను పాత జీహెచ్ఎంసీ పరిధిలోకి మళ్లించే చర్యలకు అడుగులు వేయడంతో శివారు ప్రాంత పౌరులు విస్మయం చెందుతున్నారు. రూ.2,260 కోట్ల ఆదాయం వస్తుండగా…రూ.400కోట్ల మేర కేటాయింపుల్లో టోకరా వేసింది..ఈ నిధులను పాత జీహెచ్ఎంసీ పరిధిలోనే ఖర్చు చేస్తుండడంపై శివారు ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడంగ్‌పేట, నార్సింగి, మణికొండ పురపాలికలు ప్రతి ఏటా రూ.200 కోట్ల మేర సర్ఫ్లస్లో బడ్జెట్ ఉండేదని, మౌలిక వసతుల కల్పనపై సవతి ప్రేమ తగదని మండిపడుతున్నారు. విలీనమైన పురపాలికలకు అభివృద్ధిలో జీహెచ్ఎంసీ ‘మొండిచెయ్యి’ చూపడం అన్యాయమని అంటున్నారు.
