వైరా మీదుగా విజయవాడ వైపు ఓవర్‌లోడ్‌తో ఇసుక లారీ వెళ్తోందని స్థానిక రవాణా శాఖ అధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందింది. కానీ, సదరు అధికారి మాత్రం ఆ వాహనాన్ని తనిఖీ చేసే ప్రయత్నం చేయలేదు.. పైగా సదరు లారీ యజమానికి ఫోన్ చేసి మీ వాహనం ఓవర్‌లోడ్‌తో వెళ్తుందని సమాచారం వచ్చిందని, వాహనాన్ని ఎవరి కంటపడకుండా జాగ్రత్తపడాలని సూచించాడు.

ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారులు నెలవారీ మామూళ్ల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఓవర్ లోడ్‌తో వాహనాలు అక్రమంగా రవాణా సాగిస్తున్నా.. కన్నెత్తి కూడా చూడటం లేదు. అధిక లోడు, ఇసుక, కంకర, మట్టి, గ్రానైట్ రాళ్లు రవాణా చేసే వాహనాల వద్ద నెలవారీ మామూళ్లు దండుకుంటున్నారు. నెలవారీ ఇచ్చిన వాహనాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తూ.. ఇవ్వని వాహనాలను రహదారిపై కాపుకాసి పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. అధికారులకు ఇచ్చే నెలవారీల ముసుగులో వాహన యజమానులు అక్రమ వ్యాపారానికి తెగబడుతున్నారు.
