మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయంలో నీటి ఇబ్బందులు తప్పడంలేదు. వేసవికాలం కావడంతో తాగునీటి కోసం కాలనీవాసులు అల్లాడుతున్నారు.

ప్రధానంగా నీటి సదుపాయం లేక పోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండ్ల సముదాయం పక్కన ఉన్న కుళాయి నుంచి నీటిని తీసుకెళ్తున్నారు. ఆ కుళాయి నీరు కూడా అందరికీ సరిపోవడంలేదని వాపోతున్నారు. ఎండలు మండుతుండడంతో నీటి అవసరాలు మరింత ఎక్కువయ్యాయి. తాగునీటీతోపాటు,అవసరాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందిగా మారింది. డబుల్ బెడ్ రూం ఇండ్లలో పూర్తిస్థాయిలో వసతులు లేకపోవడంతో 48 మంది లబ్ధిదారుల నుంచి సుమారు 18 మంది ఇండ్లకు తాళాలు వేసుకుని వేరే చోటీకి వెళ్లి నివాసం ఉంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి నీటి సదుపాయం కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
